21 July, 2026 | 7:15 AM

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత

20-07-2026 05:35 PM

* నిత్యాన్నదానానికి రూ.25,116 అందజేసిన మల్లారెడ్డి దంపతులు

* గదుల నిర్మాణానికి రూ. 11 లక్షలు ఇస్తామని ప్రకటన

* క్షేత్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆలయ చైర్మన్ పిలుపు

అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా భాసిల్లుతోన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి దాతలు తమ వంతు చేయూతనందిస్తున్నారు. తాజాగా సోమవారం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ హౌస్‌కీపింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్ సంస్థ అధినేత జి. మల్లారెడ్డి, ఆయన సతీమణి సువర్ణ ఉదారంగా విరాళాలు ప్రకటించారు. భక్తులకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.25,116 లను ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డికి అందజేశారు. ఆలయానికి చేరుకున్న దాత కుటుంబ సభ్యులు ముందుగా పావనాశంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గర్భగుడిలోని ఉమాసదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.  నిర్వాహకులు మర్యాదపూర్వకంగా శాలువాకకు సన్మానించారు.

* గదుల నిర్మాణానికి సాయం

ఆలయ వసతి గృహ సముదాయంలో రెండు గదుల నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షల విరాళాన్ని ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యంతో పాటు ప్రకృతి అందాలకు నిలయంగా పేరుగాంచిన ఉమామహేశ్వర క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా కార్తీకమాసం, మహాశివరాత్రి, శ్రావణమాసం వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే యాత్రికులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మల్లారెడ్డి దంపతులు రెండు గదుల నిర్మాణ బాధ్యతను స్వీకరించడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.

ఆలయానికి విచ్చేసే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించడం ఎంతో పుణ్యకార్యమని, తమ వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా క్షేత్రాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి మాట్లాడుతూ, ఉమామహేశ్వర క్షేత్ర అభివృద్ధికి మల్లారెడ్డి దంపతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. భక్తుల వసతి కోసం రెండు గదుల నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు, నిత్యాన్నదానానికి నగదు విరాళం అందించడం ఇతర దాతలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.