calender_icon.png 10 February, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కావాలా? అగాథం కావాలా?

10-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఫిబ్రవరి 9( విజయక్రాంతి): గత పదేళ్లుగా అభివృద్ధిని విస్మరించి, కేవలం ఓట్ల రాజకీయాలకు పాల్పడ్డ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. విచక్షణతో ఓటు వేయకపోతే ఆమనగల్లు మళ్ళీ బురద గుంటలు, మురుగు నీటితో నిండిపోతుంది‘ అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలను హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున 15 వార్డుల అభ్యర్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీ, అనంతరం గాంధీ చౌక్ కార్నర్ మీటింగ్లో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్ల ముప్పు ఏళ్లుగా ఆమనగల్లు సరైన అభివృద్ధికి నోచుకోలేదు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్,బిజెపి నేతలు ప్రజలను మోసం చేశారు తప్ప మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యా రన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈ రెండేళ్లలోనే సుమారురూ. 63 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పట్టణ రూపురేఖలు మార్చడానికి కృషి చేశానని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

ప్రసంగంలో భాగంగా  ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ వందల కోట్లు కుమ్మరిస్తూ, సంస్కారహీనంగా మాట్లాడుతున్న నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ‘నేను పారిపోయే రకం కాదు.. ప్రజల కోసం పోరాడే రకం‘ అని ప్రత్యర్థుల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దొంగ రాజకీయాలు వద్దు....దొంగ బియ్యం అమ్ముకుని రాజకీయం చేసే అలవాటు తనకు లేదని, సభ్యత లేకుండా మాట్లాడితే తన శైలి మార్చుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. సీట్ల కేటాయింపుల్లో అణగారిన వర్గాలకు పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు.

సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని 15 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని, పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. తాను మాట ఇస్తే తప్పనను ఆమనగల్ మార్పు కోరుకుంటుంది... ఆ మార్పు కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలంతా చేతి గుర్తుకు ఓటు వేసి మీ భవిష్యత్తును బాగు చేసుకోండని ఎమ్మెల్యే కసిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల కోఆర్డినేటర్ విజయ రెడ్డి, మున్సిపల్ ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్  లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మన ప్రాంత బిడ్డ అని ఎంపీ మల్లు రవి,

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లు అనునిత్యం అండగా ఉండి అభివృద్ధి చేస్తారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆమనగల్లు కూడా భాగస్వామ్యం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ప్రతిపక్షాల మోసపూరిత హామీలను నమ్మవద్దని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పదిహేను వాడల అభ్యర్థులు నాలుగు మండలాల పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.