పేదలను వేధిస్తారా?
- 22ఏను రద్దు చేయాల్సిందే!
- సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లూ నిషేధిత జాబితాలోనే ఉంది
- సిద్దిపేట బీజేపీ సమరభేరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
సిద్దిపేట, ఆగస్టు 31 (విజయక్రాంతి): పేదల భూములను నిషేధిత జాబితా(Prohibited List)లో పె ట్టివారిని వేదిస్తారా అని, సిద్దిపేట వంటి ప్రాంతంలో లక్షల ఎకరాల భూములను 22ఏలో పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Ramchandra Rao) మండిపడ్డారు. 22ఏను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశా రు. ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ప్రజలను భయపెట్టేలా వ్యవహరించకూడదన్నారు.
సోమవారం సిద్దిపేట ఆర్డీవో ఆఫీస్ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్(Bairi Shankar Mudiraj) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు, ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు హాజరై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. పేదల భూ ములను నిషేధిత జాబితాలో పెట్టి వారి హ క్కులను హరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోద హెచ్చరించారు.
22ఏ గందరగోళంపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని, తక్షణమే అక్రమంగా చేర్చిన భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 403 సర్వే నంబర్లు 22ఏలో ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఆ జాబితాలోనే ఉందని ఆరోపించారు. సాధారణ ప్రజల భూములు 22ఏలో చేరితే దరఖాస్తులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, మరి ప్రభుత్వ పెద్దల విషయంలో మాత్రం నిబంధనలు ఎలా మారుతున్నాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ వర్గంలోనూ ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం బాగుపడిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయన అన్నదమ్ములు బాగుపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.
ప్రజల భూములు, ప్రజల ప్రయోజనాలు మాత్రం ఎక్కడ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్లతో నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను విక్రయిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ పేదల భూములను గుంజుకుని అమ్ముకునే ప్రయత్నాలను సహించేది లేదన్నారు.
భూభారతి పేరుతో పాలకుల దగా-: ఎంపీ అరవింద్
గత ప్రభుత్వం ధరణి పేరుతో భూముల సమస్యలను సృష్టించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో అదే సమస్యను కొనసాగిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పేరు మారింది తప్పితే పద్ధతి మారలేదన్నారు. బాధ మాత్రం రైతుదే అని వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డి తనకు దోస్తేనని, ఆయన పరిపాలన తీరు తనకు బాగా తెలుసని అన్నారు. భూముల లిటిగేషన్ వ్యవహారాలు పొట్టోడు ముఖ్యమంత్రికి బాగా తెలుసంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల కోసం ఖజానా నింపాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఖజానా నింపుతున్నారంటూ ఆరోపించారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. చిన్నపాటి సమస్య ఉన్నా భూమిని 22ఏ జాబితాలో చేర్చి రైతులను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ పరిధిలోని భూములను కూడా 22ఏలో చేర్చుతున్నారన్నారు.
దమ్ముంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి తన భూములు 22ఏ నుంచి తొలగించేందుకు దరఖాస్తు ఎప్పుడు పెట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. సామాన్యులకు ఒక న్యాయం, సీఎం, మంత్రులకు మరో న్యాయ మా? ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. 22ఏ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సిద్దిపేట కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.






