4 May, 2026 | 7:54 PM

రహదారులపై ధాన్యం ఆరబోయవద్దు

04-05-2026 06:48 PM

పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట: మండలంలోని రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఎల్లపూర్, మిన్ పూర్, యూసుఫ్ పేట, కొత్తపల్లి గ్రామాల శివార్లలో మెదక్-బొడ్మట్ పల్లి రహదారి పై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

ధాన్యం కుప్పల పక్కన రాళ్లు, కర్రలు పెడుతున్నారని, రాత్రివేళ అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఖాళీ ప్రదేశాలలో ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు. ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు సహకరించాలని సూచించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ అంజయ్య, కానిస్టేబుల్ లు ప్రవీణ్, వసంత్, మధులు తదితరులున్నారు.