ఒకే ప్రాపర్టీపై రెండు అనుమతులా?
డబుల్ రిజిస్ట్రేషన్ వివాదం
పోలీసు, మున్సిపల్ అధికారుల తీరుపై అసంతృప్తి
రాజేంద్రనగర్, జూన్ 24 (విజయక్రాంతి): ఒకే ఆస్తిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించి మోసానికి పాల్పడిన వ్యవహారంలో అధికారులు స్పందిస్తున్న తీరుపై మాజీ కార్పొరేటర్ భర్త నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకే ప్రాపర్టీపై మున్సిపల్ అధికారులు ఇరు వర్గాలకు పర్మిషన్లు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సదరు ఆస్తిని 2003లో అసలు యజమానుల నుంచి తాను కొనుగోలు చేసినట్లు నరేందర్ పేర్కొన్నారు. అయితే, ఇదే ఆస్తిని ’అక్బర్ ఇక్బాల్’ అనే వ్యక్తి 2005లో రెండో పార్టీకి కూడా విక్రయించాడనీ వెల్లడించారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ మోసంపై తాము రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దాదాపు 40 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు నిందితుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు.
న్యాయం కోసం తాను ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా, అధికారులు కేవలం టీజీ బీ పాస్కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ను మాత్రమే పంపించారని తెలిపారు. ఆ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే తప్ప పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదని, అధికారులు కావాలనే సమాచారాన్ని దాస్తున్నట్లు అనుమానంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని నరేందర్ విజ్ఞప్తి చేశారు.






