11 March, 2026 | 3:36 PM

నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి

11-03-2026 01:44 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం, స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) తెలిపారు. బుధవారం 50వ డివిజన్ పరిధిలో రూ.1.17 కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి డివిజన్‌లో ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో ఆర్ఓబి నిర్మాణం, ఆధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, వరంగల్ నగరానికి ఎంతో అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు, భద్రకాళి మాడ వీధుల అభివృద్ధి వంటి కీలక పనుల అమలుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం కనిపిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.డివిజన్‌లలో కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకత్వం ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల సహకారంతోనే బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలమని ఆయన పేర్కొన్నారు. అనంతరం డివిజన్ లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు కూబ మసీదు ప్రాంతానికి చెందిన ప్రజలు తమ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని, నీటి సరఫరా సరిగా లేదని, మున్సిపాలిటీ వాటర్ మురికినీళ్లుగా వస్తున్నాయని, జులైవాడ,పోలీస్ కాలనీ ప్రాంతాలలో వాటర్ లీకేజీలు జరుగుతున్నాయని గోడు వెల్లబుచ్చారు.

అదేవిధంగా దీన్దయాల్ కాలనీకి చెందిన ప్రజలు తమ ప్రాంతంలో నివసించే వారికి ఇండ్ల పట్టాలను ఇప్పించాలని,బొడ్రాయి ఏర్పాటు చేసుకోవడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.దీనికి స్థానిక ఎమ్మెల్యే సానుకూలంగా అందిస్తూ తగిన చర్యలు తీసుకునే విధంగా అధికారులను  ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్,డివిజన్ అధ్యక్షులు అఫ్సర్ పాషా, నాయకులు ఏనుగు రాంప్రసాద్,రమేష్,వెంకన్న,బోట్ల నితిన్,బషీర్,మహేందర్,రవినాయక్,నాగరాజు  అధికారులు ఈ ఈ రవి కుమార్, డి ఈ శ్రీకాంత్, ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.