కేపీహెచ్‌బీలో ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత
కూకట్ పల్లి, జూన్ 6 (విజయక్రాంతి): కేపీహెచ్ బీ కాలనీ మీ సేవ రోడ్డు లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటుచేసిన వీధి వ్యాపారుల దుకాణాలను సిఎంసి అధికారులు శనివారం ఉదయం కూల్చి వేశారు. గత కొంతకాలంగా వీధి వ్యాపారుల వల్ల సాయంత్రం సమయంలో ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు, స్థానికులు పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా చిరు వ్యాపారుల స్టాల్స్ తొలగించాలని యజమానులకు గతంలోనే సిఎంసి అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది. నోటీసులు ఇచ్చినప్పటికీ చిరు వ్యాపారులు స్పందించకపోవడంతో పోచమ్మ ఆలయం నుండి హౌసింగ్ బోర్డు మూడవ ఫేస్ బస్టాండ్ కు వస్తున్న దారిలో ఇరువైపుల ఏర్పాటుచేసిన వీధి వ్యాపారుల స్టాల్స్ ను జెసిబి సహాయం తో సీఎంసి అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు.






