ఉద్యోగుల బకాయిలు 2 వేల కోట్లు విడుదల
- సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
- 100 రోజుల్లో 6 వేల కోట్ల బకాయిల చెల్లిస్తామన్న హామీ నిలుపుకున్న ప్రజా ప్రభుత్వం
- ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చాటుకున్న సర్కారు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఉద్యో గ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్న మాటను ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకున్నది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతూ తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల స్పష్టమైన ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం మరో రూ.2 వేల కోట్ల నిధులను విడుదలచేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రూ.6 వేల కోట్ల బకాయిలను చెల్లించింది.
మే 29న మొదటి విడత గా రూ.2,000 కోట్లు, జూన్ 30న రెండో విడతగా రూ.2,000 కోట్లు, మూడో విడతగా గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదలచేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెం డింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ నిధులతో పూర్తిగా చెల్లించింది. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థికశాఖ స్పష్టంచేసింది.
ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులు విడుదల చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తీవ్ర హర్షాతిరేకా లు వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న సానుకూల ధోరణి అభినందనీయమని ఉద్యోగ జేఏసీ నేతలు కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






