23 August, 2026 | 12:33 AM

రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్న మిషన్- కే 100

23-08-2026 12:02 AM

మహబూబాబాద్ జిల్లాలో మొదలైన రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు 

3.59 కోట్ల విలువైన ధాన్యాన్ని స్వాహా చేసిన కేసులో  రైస్ మిల్లర్ అరెస్ట్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): సీఎంఆర్ ధాన్యం మిల్లు పట్టి బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్ల పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేపట్టిన ఆపరేషన్ మిషన్ - కే 100 డిఫాల్ట్ రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా డిఫాల్ట్ మిల్లర్లతోపాటు, టెండర్ ప్యాడీ బకాయిలు ఉన్న రైతు మిల్లర్లపై సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే డిఫాల్ట్ మిల్లర్లు, టెండర్ ప్యాడి బకాయి ఉన్న మిల్లర్లతో పాటు వారికి జమానతు దారులుగా ఉన్న వారి వివరాలను పూర్తిగా సేకరించారని సమాచారం. జిల్లా వ్యాప్తంగా 16 మిల్లుల వరకు ఈ జాబితాలో ఉన్నాయని, వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు ద్వారా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా గూడూరు మండలం వెంగంపేటకు చెందిన ధనలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమాని బండి రాజమౌళి 2023-24లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 3.59 కోట్ల రూపాయల ధాన్యం బకాయి పడ్డారు.

అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటివరకు బకాయి చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాడని జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసినట్లు గూడూరు సీఐ వినయ్ కుమార్ తెలిపారు. ఇక ఇదే విధంగా మిషన్ - కే 100 ఆపరేషన్ లో భాగంగా జిల్లాలోని మిగిలిన రైస్ మిల్లర్ల పై కూడా క్రిమినల్ కేసులు, మిల్లర్ల అరెస్టులకు నివేదికలు సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే కొందరు మిల్లర్లు పోలీసు కేసులు, అరెస్టుల నుండి బయటపడేందుకు శరణు వేడుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ గాడ్ ఫాదర్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అరెస్టుల నుండి బయటపడే మార్గాలను వెతుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా ‘పెద్ద తలల’ పట్ల కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. 2022- 23 నుండి ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా దాటవేద ధోరణి అవలంబిస్తున్న బడా మిల్లర్లపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే అధికారులు మాత్రం డిఫాల్ట్ మిల్లర్లు, టెండర్ ప్యాడి బకాయి ఉన్న రైస్ మిల్లర్లు, నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు బకాయి రికవరీ కోసం కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని, ఇప్పటికే కేసముద్రం లోని తిరుమల బిన్నీ రైస్ మిల్, శ్రీ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులపై కేసు నమోదు చేసి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రికవరీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.