23 August, 2026 | 2:03 AM

వాహనం అమ్మారా.. ఆర్సీ మార్చారా?

23-08-2026 12:13 AM

ఆర్సీ బదిలీ చేయకపోతే పాత యజమానికే చిక్కులు

చలాన్లు, ప్రమాదాలు, నేరాల విషయంలో  ఇబ్బందులు

వెంటనే యాజమాన్య బదిలీ పూర్తి చేసుకోవాలంటున్న కంగ్టి సీఐ

కంగ్టి,(విజయక్రాంతి): వాహనం విక్రయించిన తర్వాత ఆర్సీలో యాజమాన్యాన్ని మార్చడం మరిచిపోవద్దని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. వాహనం అమ్మి డబ్బులు తీసుకున్నంత మాత్రాన బాధ్యత పూర్తయినట్లు కాదని స్పష్టం చేశారు. ఆర్సీలో పాత యజమాని పేరు కొనసాగితే వాహనానికి సంబంధించిన చలాన్లు, ప్రమాదాలు, నేరాల కేసుల్లో పాత యజమానికే పోలీసుల నుంచి ఫోన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఫారం-29, 30 తప్పనిసరి వాహనం విక్రేత, కొనుగోలుదారు కలిసి ఫారం-29, ఫారం-30 రెండు సెట్లు పూర్తి చేసి సంతకాలు చేయాలి. అనంతరం రవాణాశాఖ పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని, నిర్ణయించిన తేదీన వాహనం నమోదైన ఆర్టీవో కార్యాలయంలో పత్రాలు సమర్పించాలి. అక్కడి నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (సీసీ) తీసుకుని కొనుగోలుదారుకు అందజేయాలి. ఇవీ సిద్ధంగా ఉంచాలి,అసలు ఆర్సీ, సీసీ, ఫారం-29, ఫారం-30, కొనుగోలుదారు చిరునామా ధ్రువీకరణ పత్రం, విక్రేత గుర్తింపు కార్డు, వాహన బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం కాపీలను సమర్పించాలి.

స్లాట్‌ బుక్‌ చేసిన రోజున కొనుగోలుదారు ఆర్టీవో కార్యాలయానికి హాజరై ఫొటో, డిజిటల్‌ సంతకం, వేలిముద్ర ఇవ్వాలి. పేరు మారితేనే బాధ్యత మారినట్లే యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త యజమాని పేరుతో ఆర్సీ జారీ అవుతుంది. వాహనం విక్రయించిన వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని సీఐ వెంకటరెడ్డి తెలిపారు.