21 April, 2026 | 9:56 PM

పారిశుద్ధ్య పనులు చేపట్టిన కౌన్సిలర్ కర్రోల శ్రీధర్

21-04-2026 08:10 PM

మొయినాబాద్,(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా విపరీతంగా పెరిగిన చెట్లపొదలను ఇళ్ళ మధ్య పేరుకుపోయిన చెత్తను డోజర్, ట్రాక్టర్ల సహాయంతో కౌన్సిలర్ కర్రోల శ్రీధర్ తొలగించి రోడ్లను పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కర్రోల శ్రీధర్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికలో భాగంగా 14వ వార్డులో ఉన్న సమస్యలను మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సోనియా దర్శన్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ఆదేశాలతో డోజర్, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. వార్డులో రోడ్డుకు ఇరువైపులా చెట్ల పొదలు దట్టంగా ఉండడంతో వేసవికాలంలో సాయంత్రం వేళల్లో ప్రజలు బయట కూర్చునేందుకు భయపడుతున్నారని, పురుగులు, పాములు వచ్చే ప్రమాదం ఉందని వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు.

ప్రజల ఫిర్యాదు మేరకు వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్ సోనియా దర్శన్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ లతో మాట్లాడి చెట్ల పొదలు తొలగింపు పనులు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. 14వ వార్డులో కౌన్సిలర్ చొరవతో సమస్య తీరిందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. సత్వరమే స్పందించి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ కర్రోల శ్రీధర్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ఎల్గని ఎట్టయ్య గౌడ్, కందికొండ శ్రీకాంత్, ఎల్గని లోకేష్ గౌడ్, ముద్దాపురం రాఘవేందర్ గౌడ్, చాకలి యాదయ్య, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.