కాసుల వేటలో కార్పొరేట్ వైద్యం!
వైద్యో నారాయణో హరిః అంటారు. కానీ, నేడు దైవ స్వరూపం కాస్తా కార్పొరేట్ వ్యాపారిగా మారిపోతుండటం శోచనీయం. ఒకప్పుడు వైద్యశాస్త్రం శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా చదివేది. వైద్యుని వద్దకు వెళ్లిన రోగి ముందుగా తన వ్యాధి గురించిన భయాన్ని కోల్పోయేవాడు. నాడి అనేది కేవలం గుండె స్పందన కాదు. ఆనాడు వైద్యుడు రోగి చెయ్యి పట్టుకుని నాడిని చూసి రోగి శరీర తత్వాన్ని, స్థితిని రోగ లక్షణాలను అర్థం చేసుకునేవాడు. నాడి పట్టడం కేవలం ఒక పరీక్ష కాదు, అది ఒక అనుబంధం. వైద్యుడు, రోగి మధ్య ఉన్న విశ్వాసానికి ప్రతీక. ఏమీ కాదు తగ్గిపోతుందని చెప్పిన మాటే అర్ధచికిత్సగా పనిచేసేది. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సమాజ తీరుతెన్నులు మారిన ప్ర స్తుత పరిస్థితుల్లో వైద్యుని వద్దకు రోగి వెళ్తున్నాడే తప్ప, అతని బాధల్ని పం చుకునే తీరిక డాక్టర్లకు లేకుండాపోయింది. కనీసం నాడిని పట్టి చూసే పరిస్థితి కూడా లేదు. వైద్యులు కంప్యూటర్ స్క్రీన్‌ను చూసి, చికిత్స చేస్తున్నారు. రోగి తన బాధను చెప్పేలోపే డాక్టర్ పరీక్షల జాబితా రాసేస్తుంటాయి. వైద్యం సేవ నుంచి వ్యాపారంగా, ఆపై దోపిడీగా రూపాంతరం చెందింది. ఇది వైద్య అభివృద్ధి కాదు, మానవత్వం వెనుకబడిందనడానికి సంకేతం.
రోగి కంటే ముందే నేడు రిపోర్టులు మాట్లాడతాయి. జ్వరం అని వెళ్తే చాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అంటూ డజన్ల కొద్దీ రక్త పరీక్షలు. అవి సరిపోదన్నట్టు ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, సిటిస్కాన్, ఎంఆర్‌ఐలు. రోగి అసలు సమస్య ఒకటైతే, అవసరం లేని పరీక్షలతో ఏదో పెద్దరోగమే వచ్చిందని భయంతో వణికిపోయే పరిస్థితి దాపురించింది.
నేటి కార్పొరేట్ ఆసుపత్రులు వెలుపల నుంచి చూస్తే ఐదు నక్షత్రాల హోటళ్లలా కనిపిస్తాయి. కానీ, ఆ గాజు గోడల వెనుక దాగి ఉన్న వాస్తవం చాలా భయానకంగా ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులు సేవా కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. చికిత్స ఒక ఉత్పత్తి అయిపోయింది. రోగి ఒక ఆదాయ వనరుగా మారిపోయాడు. అవసరం ఉన్నా, లేకపోయినా అనేక పరీక్షలు చేయించాల్సిందే. ఎందుకంటే ప్రతి పరీక్ష ఒక ఆదాయమే.
ప్రాణం కంటే లాభం గొప్పగా కనిపించే చోట మానవత్వం ఎప్పుడో చనిపోయింది. చాలా మంది రోగులు ఒకే సమస్యతో ఇద్దరు వైద్యులను సంప్రదిస్తారు. ఒక డాక్టర్ దగ్గర చేయించుకున్న స్కానింగ్ రిపోర్టును మరో డాక్టర్ నమ్మరు. మళ్లీ అదే రోజు, అదే పరీక్ష మరో ల్యాబ్‌లో చేయించమంటారు. ఆ ల్యాబ్‌లలో చేసిన పరీక్షలకు వేర్వేరు రిపోర్ట్‌లు వస్తాయి. ఇది ఎలా సాధ్యం? నాణ్యత లేని పరికరాలా? సరైన శిక్షణ లేని సిబ్బందా? ప్రమాణాలు పాటించని ల్యాబ్‌లా? లోపం ఎక్కడ ఉంది? ఒక తప్పుడు రిపోర్ట్ ఓ ఆరోగ్యవంతుడిని రోగిగా మార్చవచ్చు. ఒక రోగిని ఆరోగ్యవంతుడిగా చూపించి అతని ప్రాణాన్ని ప్రమాదంలో పడేయవచ్చు. వైద్యరంగంలో ఇది ప్రాణాంతక సత్యం.
మన దేశంలో ల్యాబ్‌ల నాణ్యతపై అనుమానాలు పెరుగుతున్నాయి. చాలా ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ఆధునిక పరికరాలకు బదులు కాలం చెల్లిన పాత పరికరాలతో పరీక్షలు చేస్తున్నారు. వాటి నాణ్యతను ఎవరు పరిశీలించకపోవడమూ ఇందుకు కారణం. ఇది ఒక రకంగా రోగిని దోపిడీ చేయడమే. తప్పు ఫలితాలు తప్పుడు చికిత్సకు దారితీస్తాయి. తప్పు చికిత్స ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఇది చట్టపరంగా కూడా నేరమే.
చాలా సందర్భాల్లో వైద్యులు కమీషన్ కోసమే ప్రత్యేక ల్యాబ్ లేదా స్కానింగ్ సెంటర్‌కు రోగిని పంపిస్తారు. కమీషన్ల కోసమే మళ్లీ మళ్లీ పరీక్షలు రాస్తున్నారనేది బహిరంగ రహస్యం. దీని కోసం ల్యాబ్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు కొంతమంది వైద్యులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రతి రోగి నుంచి వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం వైద్యునికి అందుతుంది. వైద్యుడు రోగి విశ్వాసాన్ని అమ్ముకోవడం కేవలం నైతిక ద్రోహం కాదు, అది మానవత్వానికి చేసిన ద్రోహం.
రక్త, మూత్ర పరీక్షలు, సిటిస్కాన్, ఎంఅర్‌ఐ, ఎక్స్ రే ఇవన్నీ వైద్యశాస్త్రానికి అమూల్యమైన సాధనాలు. ఇవి వైద్యునికి చికిత్సలో సహాయంగా మాత్రమే ఉండాలి. వైద్యుని స్థానాన్ని భర్తీ చేయకూడదు. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. వైద్యుడు ముందుగా పరీక్షలు రాస్తున్నాడు. తర్వాత రిపోర్ట్ చూసి మందులు రాస్తున్నాడు. ఒక రిపోర్ట్‌పైనే పూర్తిగా ఆధారపడి ఓ వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ణయించడం సరికాదు. రిపోర్ట్‌లో కనిపించేవి అంకెలు మాత్రమే. కానీ, రోగి ఒక మనిషి. అతనిలో భయం, బాధ, ఆశ ఉంటుంది. వైద్యుడు ఈ విషయాలను ముందుగా అర్థం చేసుకోవాలి.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకపోతే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ప్రభుత్వం ఆరోగ్యరంగాన్ని నియంత్రించడానికి ఆరోగ్య శాఖ, మెడికల్ కౌన్సిల్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. ఇన్ని వ్యవస్థలు ఉన్నా ల్యాబ్‌ల తనిఖీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసిన ల్యాబ్‌లపై చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనపడదు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి ల్యాబ్, స్కానింగ్ సెంటర్, ఆసుపత్రిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. కాలం చెల్లిన పరికరాలను ఉపయోగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాలను పాటించని ల్యాబ్‌లను మూసివేయాలి. కమీషన్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలి. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని కఠినంగా శిక్షించాలి.
నేడు వైద్యులపై ఉన్న విశ్వాసాన్ని ప్రజలు కోల్పోతున్నారు. విశ్వాసం లేకుండా వైద్యం పనిచేయదు. కాబట్టి వైద్యుడిని రోగి నమ్మాలి, రోగిని వైద్యుడు రక్షించాలి. వైద్యం లాభార్జన కోసం చేసే వ్యాపారం కాదు, అదొక బాధ్యత. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రాణానికి ధర ఉంటుంది, కానీ విలువ ఉండదు. వైద్యం మళ్లీ పవిత్రతను పొందాలి. వైద్యుడు మళ్లీ నారాయణుడిగా గుర్తింపు పొందాలి. వైద్యుని మాటే మందు, మాటే మంత్రం, చేయి ఔషధం అవ్వాలి.
అన్నింటికంటే ముఖ్యంగా, వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని స్మరించుకోవాలి. రోగిని ఒక ఏటీఎం మెషిన్‌లా కాకుండా ప్రాణమున్న మనిషిలా చూడాలి. వైద్యులు మానవత్వాన్ని చూపించాలి. వైద్యుడు రోగి నాడిని పట్టకపోయినా అతని మనసును పట్టాలి. అతనిలో ఉన్న భయాన్ని తొలగించాలి. మనిషి ప్రాణం వస్తువో, సంఖ్యనో కాదు. అది ఎంతో అమూల్యమైనది. వైద్యంలో అవకతవకలు పెరిగితే అది కేవలం వ్యక్తిగత నష్టం కాదు, సామాజిక నష్టం. ప్రభుత్వం కూడా కఠిన నియంత్రణ అమలు చేయాలి. ప్రతి ల్యాబ్, ప్రతి మిషన్ ప్రతి పరీక్షకు కచ్చితమైన ప్రమాణాలు రూపొందించాలి. ప్రతి రిపోర్ట్‌కు ఒక బాధ్యత ఉం డాలి.
ల్యాబ్‌లు తమ పరికరాల నాణ్యత ను నిరూపించాలి. ప్రతి రోగికి తన రిపోర్ట్‌పై ప్రశ్నించే హక్కు ఉండాలి. ప్రతి ఆసుపత్రి తమ సేవలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. పారదర్శకత లేకుండా విశ్వాసం రావడం అసాధ్యం. ప్రజలు కూడా వ్యాధి వచ్చిన తర్వాత మందు వాడేకంటే వ్యాధి రాకుండా చూసుకోవడం తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. నేడు మనం ఎదుర్కొంటున్న సంక్షోభం కేవలం వ్యాధుల సంక్షోభం కాదు, అది వ్యవస్థ సంక్షోభం, విలువల సంక్షోభం, మానవత్వ సంక్షోభం. ఈ పరిస్థితిని మార్చడానికి వైద్యులు, ప్రభుత్వం, సమాజం సమానంగా బాధ్యత తీసుకోవాలి.
వ్యాసకర్త సెల్: 8466827118






