25 July, 2026 | 2:01 AM

విద్యను వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్ సంస్థలు

25-07-2026 01:03 AM

బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ 

తాడ్వాయి, జూలై, 24 (విజయక్రాంతి): విద్యను కార్పొరేట్ సంస్థలు వ్యాపారంగా మారుస్తున్నాయని బివిఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులో పాఠశాల విద్యా కార్యాలయం ముందు శాంతియుతంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, గురుకులాలకు స్వంత భవణాలు నిర్మించాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని పాఠశాలల్లో కళాశాలలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని డిమాండ్ చేస్తూ బివిఎం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన రవితేజ చేస్తున్న ధర్నాను అడ్డుకొని పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఆయన ఫోన్ లో  మాట్లాడుతూ... పేదవాడికి విద్య దక్కకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం దీనిపైన స్పందించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించాలని కోరారు.పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బివిఎం నాయకులు శ్రీధర్, ప్రవీణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.