25 July, 2026 | 1:54 AM

బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

25-07-2026 01:00 AM

బోధన్, జూలై 24 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్, సీపీఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు పుట్ట వరదయ్య మాట్లాడుతూ, ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు విద్యార్థులు, యువకులు నిర్వహించిన శాంతియుత నిరసనపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్లు ప్రయోగించడం అమానుష చర్య అని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని తీవ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకులు ఎండి ఇర్షాద్, గంగారాం, సీపీఐ(ఎం) నాయకులు గోపి, ఎంసీపీఐ(యు) నాయకుడు మోసిన్, ఎంసీపీఐ(యు) ఫార్వర్డ్ పార్టీ నాయకుడు నాగరాజు తదితరులు, వివిధ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.