నిబంధనలకు విరుద్ధంగా షెడ్డు నిర్మాణం
ఘట్కేసర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్ సమీపంలో సన్ షైన్ పార్క్ పక్కన ఉన్న సర్వే నంబర్ 129లో ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా అక్రమ షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రధాన రహదారి వెంట వరుసగా షట్టర్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఈ అక్రమ నిర్మాణాల వల్ల నష్టపోతుందని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇప్పటికే నిర్మించిన వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ప్రజా ఉద్యమానికి దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు.






