ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర
- ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి
- సమ్మెను విరమింప జేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- ఎలెక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలి
- కార్మికులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న తలసాని
సికింద్రాబాద్,ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.గురువారం సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాధర్నాకు ఆయన హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ 92 సంవత్స రాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు.
సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ వేలాదిమంది ఉద్యోగుల శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించి సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్ప ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదన్నారు. సమస్యల పరిష్కారమయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఎలెక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని మండిపడ్డారు.
ఎలెక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతో నడిపించాలని డిమాండ్ చేశారు. నగరంలోని రాణిగంజ్, గౌలిగూడ తదితర 5 ఆర్టీసీ డిపోలను ఎలెక్ట్రికల్ బస్సులకు చెందిన ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని, ఎవడబ్బ సొమ్మని ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తారని ధ్వజమెత్తారు.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్‌లో తీర్మానించి గవర్నర్‌కు పంపించిందని తెలిపారు.ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయా లని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలన్నారు. రిటైర్ ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు టార్గెట్‌లు పెడు తూ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఎలెక్ట్రికల్ బస్సుల నిర్వాహకులకు ప్యాసెంజర్‌లు లేకున్నా కిలో మీటర్‌కు 56 రూపాయలు చొప్పున ఎలా చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రోద్బలంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని, అలా మాట్లాడటానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు ప్ర భుత్వాన్ని అడుగుతున్నారని తలసాని శ్రీనివాస్ అన్నారు.






