calender_icon.png 9 February, 2026 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

09-02-2026 03:48:50 PM

- పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ టౌన్: కొల్లాపూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. సోమవారం పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ భారీ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ ర్యాలీలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనగా, పట్టణ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కొల్లాపూర్ పట్టణ ముఖచిత్రం మారుతుందని స్పష్టం చేశారు. గత మున్సిపల్ ఎన్నికలను గుర్తు చేసుకున్న మంత్రి, “గత ఎన్నికల్లో నేను బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించినా గౌరవాన్ని నిలబెట్టిన కొల్లాపూర్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆ కృతజ్ఞతతోనే అధికారంలోకి రాగానే కొల్లాపూర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

ఈ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండని భావోద్వేగంగా పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను మంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌దే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అమరవీరుల త్యాగాలను విస్మరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, కొల్లాపూర్ పట్టణానికి తాగునీరు అందించే సోమశిల వద్ద ఉన్న నీటి మోటార్లను కూడా అమ్ముకున్న నీచ చరిత్ర గత పాలకులదేనన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను గాలికొదిలేసిన వారికి మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు, నిరంతర తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థే కాంగ్రెస్ అజెండా అని స్పష్టం చేసిన మంత్రి, పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ అభ్యర్థులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.