ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్
- కురుమల ఆత్మగౌరవ భవనాన్ని ప్రైవేటుపరం ప్రయత్నాలు బాధాకరం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): కురుమ భవనాన్ని ప్రస్తుతం అద్దెకు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కురుమల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దొడ్డి కొమురయ్య పేరుతో నిర్మించిన ఆత్మగౌరవ భవనాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు బాధాకరమని, ఇది దొడ్డి కొమురయ్య ఆశయాలకు విరుద్ధమని విమర్శించారు. రాష్ట్రంలోని కురుమ, యాదవ సమాజాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నాయకులు శుక్రవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురు మ, యాదవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమ సమాజ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.
కురుమ సమాజం సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు పేద విద్యార్థుల వసతి గృహం కోసం కోకాపేట్‌లో ఐదు ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. రూ.7 కోట్ల వ్యయంతో దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి, కురుమ సంఘానికి ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దేశంలోనే వినూత్న సంక్షేమ కార్యక్రమం అన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కొత్త యూనిట్ల పంపిణీని నిలిపివేసి వేలాది కుటుంబాల ఆశలను అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కురుమలకు ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఒకవైపు గొర్రెల పంపిణీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, మరోవైపు ఆత్మగౌరవ భవనాలను అద్దెకు ఇస్తోందని మండిపడ్డారు.
దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం--వసతిగృహాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కురుమ, యాదవ సంఘాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కురుమల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, కురుమ సమాజానికి అండగా నిలుస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.






