25 June, 2026 | 1:31 AM

యూరియా యాప్ రద్దు చేయాలి

25-06-2026 12:24 AM
  1. నేరుగా ఎరువులు అందజేయాలి
  2. రాస్తారోకో నిర్వహించిన ధర్మారెడ్డి గ్రామ రైతులు
  3. అన్నదాతల ఆందోళనలతో స్తంభించిన ట్రాఫిక్ 

నాగిరెడ్డిపేట్, జూన్ 24 (విజయక్రాంతి): మండ లంలోని ధర్మారెడ్డి గ్రామ రైతులు యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మరెడ్డి గ్రామ రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యూరియా యాప్ వల్ల నిరక్షరాస్యులైన రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు వద్ద స్మార్ట్ ఫోన్ లేదని, కొంతమందికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో యాప్ ఆధారిత బుకింగ్ విధానం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని ఆరోపించారు. అసైన్‌మెంట్ భూముల్లో సాగు చేసే రైతులు,చిన్న,సన్నకారు రైతులు ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..విషయం తెలుసుకున్న స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ జయరాజ్, రైతులు పాల్గొన్నారు.