ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఫిర్యాదు
సర్పంచ్ గుమ్మల్ల వెంకటేశ్వర్‌రెడ్డి
బాలానగర్ ఆగష్టు 17 : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, ప్రజా అవసరాలకు వినియోగించాలని బాలానగర్ గ్రామ సర్పంచ్ గుమ్మల్ల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలం, భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామపంచాయతీకి అప్పగించాలని ఆయన వినతిపత్రంలో కోరారు.
గత ప్రభుత్వ హయాంలో కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని సర్పంచ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలు, భవనాలు అన్యాక్రాంతం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం వినియోగంలో లేని భవనాలను పరిశీలించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.






