సాగునీటి కాలువ పునరుద్ధరణ పనుల ప్రారంభం
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ పట్ల రైతుల హర్షం
కోదాడ, మే 13: కోదాడ మండలం, రెడ్లకుంట గ్రామంలోని ఎస్సీ మాన్యాల రైతులకు సాగునీటి కష్టాల నుండి విముక్తి కల్పిస్తూ ఎన్.హెచ్.పి కెనాల్ నుండి సాగునీటి కాలువ పునరుద్ధరణ పనులను సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు బుధవారం ప్రారంభించారు.
సర్పంచ్ కుటుంబరావు మాట్లాడుతూ కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక సహకారం, ఓ అండ్ ఎం కమిటీ నిధులతో ఈ పనులను చేపట్టామన్నారు. , రెడ్లకుంట గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, చివరి భూములకు కూడా సాగునీరు అందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించారన్నారు.
ఎస్సీ మాన్యాల కాలువ పూడికతీత, పునరుద్ధరణ పనుల వల్ల ఇక్కడి ఎస్సీ సోదరులైన రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు, రైతులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డి.ఈ సువర్ణరేఖ, ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, గుండె సత్యనారాయణ, వార్డ్ సభ్యులు మరియు రైతులు చిర్రా నరసింహారావు, నారసాని వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.






