మిల్లర్లు వరి ధాన్యం సేకరణ, దిగుమతిలో వేగం పెంచాలి
ఎస్పీ నరసింహ
సూర్యాపేట, మే 13 (విజయక్రాంతి) : మిల్లర్లు వరి ధాన్యం సేకరణ, దిగుమతుల్లో వేగం పెంచాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి వరి ధాన్యాన్ని మిల్లర్లకు చేర్చడం కోసం రవాణా వాహనాలను సమకూర్చడంలో భాగంగా బుధవారం సూర్యాపేట రూరల్ పరిధి జాతీయ రహదారి 65 పై టేకుమట్ల వద్ద ట్రాన్స్ పోర్ట్ శాఖ, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల అధికారుల సమన్వయంతో లారీల యజమానులతో, డ్రైవర్లతో మాట్లాడారు.
వరి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలని, దీనికోసం లారీ డ్రైవర్లు యజమానులు సహకరించాలని కోరారు. అనంతరం చివ్వెంల మండల పరిధి జాతీయ రహదారి వెంట ఉన్న నవరత్న ఫార్ బాయిల్ రైస్ మిల్ లో ధాన్యం దిగుమతి, సేకరణను అధికారులతో కలిసి ఎస్పీ పరిశీలించారు.
చిన్న తరహా మిల్లర్లు కూడా వరి ధాన్యం సేకరణకు ముందుకు రావాలని కోరారు. ఫార్ బాయిల్ రైస్ మిల్ నందు హమాలీలతో మాట్లాడి వేగంగా ధాన్యాన్ని దిగుమతి చేయాలని సూచించారు. రైతన్నలకు జిల్లా యంత్రాంగం అండగా ఉన్నది, ఆందోళన చెందవద్దన్నారు. అకాల వర్షాల వల్ల వరి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని, ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈయన వెంట సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్థానిక ఎస్త్స్రలు బాలు నాయక్, మహేష్, పలు శాఖల సిబ్బంది ఉన్నారు.






