19 May, 2026 | 3:20 PM

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

19-05-2026 01:51 PM

ఎర్రుపాలెం మే 19 (విజయ క్రాంతి):  అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని మండల కేంద్రంలోని కామ్రేడ్  రామిశెట్టి పుల్లయ్య భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా రైతు సంఘం కార్యనిర్వాహక సభ్యులు దివ్వెల వీరయ్య, సిపిఎం మండల కార్యదర్శి మద్దల ప్రభాకర్ రావు లు పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ సుందరయ్య ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం వారు మాట్లాడుతూ దేశంలో సామాజిక వివక్షత, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి నిరంతరం శ్రమించిన మహానేత అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని పేర్కొన్నారు.

శ్రమజీవుల హక్కుల కోసం పేదల ఆత్మగౌరవం కోసం సుందరయ్య రాజీలేని పోరాటాలు చేశారన్నారు దున్నేవానికి భూమి నినాదంతో లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఎం పార్టీదని పేర్కొన్నారు. నేటి సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న దోపిడి పై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో పేదల పట్ల, నవ సమాజ నిర్మాణం కొరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దూదిగం బసవయ్య నక్క పుల్లారావు, కోటి సుబ్బారెడ్డి, రవి, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.