19 May, 2026 | 2:59 PM

జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

19-05-2026 01:50 PM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ 

నాగర్‌ కర్నూల్, (విజయక్రాంతి): జనగణన ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సాతాపూర్, పసుపుల గ్రామాల్లో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని, ఏ కుటుంబం కూడా మిగలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డులు ధరించాలని తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక వివరాల సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో... పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ పరిధిలో నాపగుంపు నుంచి పెద్దకుంట వరకు కొనసాగుతున్న ఉపాధి హామీ ఫీడర్ ఛానల్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, కూలీల హాజరు వివరాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఫీడర్ ఛానల్ పనులు పూర్తయితే సాగునీటి వనరులు మెరుగుపడి సుమారు 50 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కూలీలకు వేతనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పరిధిలో చేపడుతున్న ఓహెచ్‌ఎస్‌బీఆర్ పనులను కూడా పరిశీలించిన కలెక్టర్, గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో ఈ పనులు కీలకమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.