93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి
ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు రైతుల వినతి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామ శివారులోని 93/2 సర్వే నెంబర్లు దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.సుమారు 40 నుంచి 50 సంవత్సరాలుగా 160 మంది రైతులు దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గతంలో ప్రభుత్వం ఈ భూములను నిరుపేద రైతులకు పంపిణీ చేయగా, పలువురు రైతుల వద్ద పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపారు. రాళ్లు, రప్పలతో పనికిరాని భూమిని సాగుకు అనుకూలంగా మార్చేందుకు బోర్లు తవ్వించడం, విద్యుత్ లైన్లు వేయించడం, భూమిని లెవల్ చేయించడం వంటి పనులకు భారీగా ఖర్చు అయిందని, అప్పులు చేసి బంగారు నగలు విక్రయించి సాగు చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు.
గతంలో ఈ భూముల ఆధారంగా పంట రుణాలు పొందామని, ఆర్‌ఓఆర్,టైటిల్ పత్రాలు కూడా అందాయని తెలిపారు. అయితే ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో పాసుపుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి సర్వే నంబర్ 93/2లో సాగులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు ఉన్నారు.






