4 July, 2026 | 2:32 AM

టేకులపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

04-07-2026 01:37 AM

పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ ఫారమ్ల సేకరణ పరిశీలన

యూరియా గోదాం తనిఖీ 

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ 

టేకులపల్లి, జులై 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి (ౄEO) టేకులపల్లి మండలంలో శుక్రవారం పర్యటించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్లు నెం.158, 159 లను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారమ్ (EF)ల పంపిణీ, సేకరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), బీఎల్వో సూపర్వైజర్లతో మాట్లాడిన కలెక్టర్, ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారమ్లు అందజేయాలని, నింపిన ఫారమ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో సేకరించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా సంప్రదించి, అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరమే ఫారమ్లను స్వీకరించాలని, సందేహాలు ఉన్న వారికి తగిన అవగాహన కల్పించాలని తెలిపారు.

ఫారమ్ల పంపిణీ, సేకరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, పురోగతిని ఉన్నతాధికారులకు నివేదించాలని బీఎల్వోలకు సూచించారు. అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలోని  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) ను తనిఖీ చేశారు. విద్యాలయంలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారి చదువు, ఆరోగ్యం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు బేతంపూడి సొసైటీ ద్వారా రైతులకు పంపిణీ చేసే ఎరువుల గోదామును పరిశీలించారు. ఈ పర్యటనలో ఎన్నికల శాఖ అధికారులు, మండల అధికారులు, బీఎల్వోలు, బీఎల్వో  సూపర్వైజర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.