calender_icon.png 12 February, 2026 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ హనుమంతరావు

12-02-2026 12:38:07 AM

చౌటుప్పల్, ఫిబ్రవరి 11:  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం లో ఏర్పాటు చేసిన పర్యావరణహిత పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు మంగళవారం కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. హరిత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసిన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయోగం చేపట్టామని తెలిపారు.

ప్లాస్టిక్ రహిత వాతావరణం కాగితం వస్త్ర బ్యానర్లు, జూటు సంచుల వినియోగం, తాగునీటి కోసం మట్టి కుండలు ఏర్పాటు వంటి చర్యలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి హరిత చర్యలు అమలు చేయాలని దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటడం, ఓటర్లకు నీడనిచ్చేలా పచ్చ కవచాలు ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్లు ప్రదర్శించడం విశేషంగా నిలిచాయి.

ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం 

ఓటర్లకు గ్రీన్ మెసేజ్ అందేలా ప్రత్యేకంగా అలంకరించడం ఆకట్టుకుందని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. వీల్ చైర్లు, రాంపులు, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి ప్రదేశం వంటి ఏర్పాట్లను ప్రశంసించారు. సిబ్బంది సమయపాలన, ఓటర్లకు అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణహిత ఏర్పాట్లపై ఓటర్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కేంద్రాల్లో ఓటు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం అద్దిన ఈ వినూత్న ప్రయత్నం చౌటుప్పల్ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఓటు హక్కుతో పాటు ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తుచేసిన ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ వి. హనుమంతరావు పేర్కొన్నారు.