సావిత్రి అంటే తెలుగుతనం.. అమ్మతనం
‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభలో జయప్రద
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్‌రెడ్డి, నిర్మాత నాగసుశీల, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన జయప్రద మాట్లాడుతూ.. “ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వేదిక మీద నిలబడగలం. అమ్మ సావిత్రి పేరు ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. సావిత్రమ్మ నటించినప్పుడు నేను పుట్టలేదు. ఆమె సినిమాల్ని చూస్తూ పెరిగాను. సావిత్ర అంటే ఉత్తమ నటన.. ఉత్తమ నటన అంటే సావిత్రి. ఆమే ఒక అద్భుతం. ఆమె ఒక్క చూపులోనే ఎన్నో హావభావాలుంటాయి. ఈ తరానికి సావిత్రమ్మను పరిచయం చేయాలని ఇంగ్లీష్ ఎడిషన్‌లో పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సావిత్రి అంటే తెలుగుతనం, అమ్మతనం. సంజయ్ ఎంతో పరిశోధన చేసి ఇలాంటి పుస్తకాల్ని తీసుకు రావడం సంతోషంగా ఉంది. సావిత్రమ్మ లాంటి వాళ్లు మళ్లీ పుట్టలేరు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి” అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ.. “సావిత్రి ప్రాతఃస్మరణీయులు కారు.. చిరస్మరణీయులు. కొంత మంది పుడతారు.. భగవంతుడు కొంత మందిని పుట్టిస్తాడు. అలాంటి వారిని కారణజన్ములు అంటారు. అలాంటి వారిలో సావిత్రి ఒకరు. ఈ గడ్డపై సావిత్రి జన్మించడం మన అదృష్ణం. ఆ తల్లి కోటానుకోట్ల హావభావాల్ని అందించారు. సావిత్రి గంధర్వుల్లాంటి వారు. అలాంటి వారికి మరణం ఉండదు. ఇక్కడ విధి నిర్వహణ అయ్యాక.. ఇంకో ప్లానెట్‌కు వెళ్లి విధిని నిర్వర్తిస్తుంటారు. ఆమెతో ఒక్క సినిమా అయినా నటిస్తే బాగుండు కదా? అనే కోరిక ఉండేది. ఆమెతో నటించే భాగ్యం నాకు దక్కలేదు. సావిత్రిని స్మరించుకోని తెలుగువారు, తెలుగు జాతి ఉండదు. సంజయ్ కిషోర్ లాంటి కళా జీవుల వల్లే సావిత్రి వంటి వారు ఏళ్లపాటుగా జీవించి ఉంటున్నారు. తల్లి రుణాన్ని తీర్చుకుంటున్న చాముండేశ్వరి జీవితం చరితార్థమవుతుంది. ఈ పుస్తకం, ఆ ముఖచిత్రం చూసి నా కంట్లోంచి నీరు వచ్చేసింది” అని చెప్పారు.
విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. “అమ్మ మీద అందరికీ అభిమానం ఉంటుంది. అయితే ఆమె జ్ఞాపకాల్ని ఎప్పటికీ భద్రపర్చాలని సంజయ్ కిషోర్‌ను సంప్రదించాను. తెలుగులో ఈ బుక్‌కి మంచి స్పందన వచ్చింది. మరింత మందికి రీచ్ అవుతుందని ఇంగ్లిష్ ఎడిషన్‌ను రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపారు.
పుస్తక రచయిత సంజయ్ కిషోర్ మాట్లాడుతూ.. “ఆ నాటి నటిని మనం ఇప్పటికీ తల్చుకుంటున్నాం. ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు’ అని ఆత్రేయ అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగు సినిమాలో చరిత్రలో ఏ కథా నాయికకి ఊరూరా విగ్రహాలు లేవు. అందుకు సావిత్రి ఎప్పుడూ జీవించే ఉంటారు. తెలుగు జాతి స్త్రీకి ప్రతీకగా సావిత్రి నిలిచారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోవిందరావు, వర ప్రసాద్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, బొల్లినేని కృష్ణయ్య కూడా మాట్లాడారు.






