11 July, 2026 | 1:43 AM

ఆమనగల్లును మింగేస్తున్న భూబకాసురులు

11-07-2026 12:40 AM

మున్సిపాలిటీలో ఫోర్జరీల పర్వం! 

నకిలీ పత్రాలతో నయా దందా.. 

కమలా నగర్‌లో ఫోర్జరీ సంతకాలతో 280 ప్లాట్ల మాయాజాలం

ప్రశ్నిస్తే ఓ సామాజికవర్గంపై అక్రమ కేసులు.. 

గ్రామకంఠం, ఎల్లమ్మ గుడి స్థలాలపై కబ్జాదారుల కన్ను

రంగారెడ్డి, జులై 10 (విజయక్రాంతి): రాజకీయ అండదండలు.. మున్సిపల్ అధికారుల అపారమైన ‘సహకారం’.. వెరసి ఆమనగల్లు మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు, ప్రభుత్వ భూముల కబ్జాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోనే అత్యంత కీలకమైన ఈ పట్టణంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ, శిఖం భూములను నామరూపాలు లేకుండా తుడిచేస్తూ వెంచ ర్లు వేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ వెలుస్తున్న ఇల్లీగల్ వెంచర్లు, ఫోర్జరీ పత్రాల దందాను ప్రశ్నించిన ఒక సా మాజిక వర్గాలపై అక్రమ కేసులు బనాయి స్తూ నోరు నొక్కేసే కుట్రలు సాగుతున్నాయి.

గుర్రం గుట్ట  కమల నగర్ లో వెలుగు చూస్తున్న ఫోర్జరీ భాగోతం..

అమాయక ప్రజలను ఆసరా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన ప్లాట్ల సంఖ్య గుర్రం గుట్ట కమలానగర్లో దాదాపుగా 180 నుండి 280 పైనే ఉంటుందని తెలుస్తోంది. పేద ప్రజలు రక్తం కూడబెట్టి దాచుకున్న పైసలను కబ్జాదారులు నకిలీ పత్రాలతో దోచే స్తుంటే.. మున్సిపల్ యంత్రాంగం మౌనరాగం వహిస్తుండటం గమనార్హం.

కోవర్ట్ ముఠా చీకటి ఒప్పందాలు:

మున్సిపాలిటీలో ‘ఇన్ఫార్మర్ల‘ పేరిట చలామణి అవుతున్న ఒక కోవర్ట్ ముఠా ఈ అక్రమ దందాను వెనకుండి నడిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి చెందిన గైరాన్ భూమి ప్లాట్ల కొనుగోలు వెనుక పెద్ద చీకటి ఒప్పందమే జరిగిందని, ఇందులో అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

అక్రమ కేసులు, విషప్రచారం:

గ్రామ కంఠం భూమి, సందబావి సమీపంలో గల రేణుక ఎల్లమ్మ గుడి స్థలంలో దళితులకు జరిగిన అన్యాయముపై న్యాయ పోరాటం చేస్తుంటే, ఆ పోరాటాన్ని అణచివేయడానికి భూమాఫియా అక్రమ మార్గాలు ఎంచుకుంది. గుడి విషయానికి అసలు సంబంధమే లేని 12 మంది ఒక సామాజిక వర్గం కు చెందిన వారి పై అక్రమ కేసులు బనాయించడం ఇక్కడి దళిత వ్యతిరేక విధానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

నిజమైన కబ్జాదారులు తాము సేఫ్గా ఉంటూ.. ఊరిని సర్వనాశనం చేస్తున్న కోవర్ట్ ముఠాతో చేతులు కలిపారు.బాధితులనే కబ్జాదారులుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో విషం చిమ్ముతున్నారు.అక్షర సత్యాల వెనుక దాగున్న ఈ చీకటి ఒప్పందాలను, ఫోర్జరీ అక్రమ లావాదేవీల రంకు నాటకాన్ని న్యాయవ్యవస్థలోనే తేల్చుకుంటామని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భగ్గుమంటున్న ఆమనగల్లు:  

పట్టణంలో చోటు చేసుకుంటున్న వరుస అక్రమాల పర్వంపై టాస్క్ఫోర్స్ విచారణకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫోర్జరీ, అక్రమాలపై అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న ఫోర్జరీ లావాదేవీలు, కబ్జాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.