10 July, 2026 | 10:28 PM

75వ వసంతంలోకి 'మొక్కల' వెంకటయ్య

10-07-2026 09:31 PM

పచ్చని మొక్కతో జన్మదిన శుభాకాంక్షలు

కొత్తగూడెం,(విజయ క్రాంతి): రావి వెంకటయ్య తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితం చేస్తూ, మొక్కలు నాటడం, పెంచడం, పంచడాన్ని జీవన లక్ష్యంగా చేసుకుని తన పేరునే మొక్కల వెంకటయ్యగా మార్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతానికి చెందిన ఆయన 75వ జన్మదిన వేడుకలను ప్రకృతి ప్రేమికులు, అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. "బొకే వద్దు.. పూల మొక్కలే ముద్దు" అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకృతి హరిత దీక్షరాలు నైనిక రజువా, ప్రకృతి వైద్యులు జి. సుగుణారావు మొక్కల వెంకటయ్యకు పచ్చని మొక్కను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి శుభ సందర్భాల్లో పూల బొకేలకు బదులుగా మొక్కలను బహుమతిగా అందించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు జి. సుగుణారావు, ప్రకృతి హరిత దీక్షరాలు నైనిక రజువా, ఆఫాన్ జైదీ, ముస్తఫా, పర్వీన్, రావి లక్ష్మి, అనువంశిక వైద్యులు రామంచి శ్రీనివాస్, సాగర్, దశరథ్ రజువా, శంకర్, శిరీష, కుమారి, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.