6 June, 2026 | 4:41 PM

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

06-06-2026 03:17 PM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండీ అహ్మద్ అన్నారు. పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో శనివారం ‘99 రోజుల కార్యాచరణ’లో భాగంగా ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇళ్ల చుట్టుపక్కల చెత్తచెదారం వేయకుండా పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల మురుగు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వార్డులలో ప్రజలకు ఉన్న సమస్యలను స్థానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని, మున్సిపల్ యంత్రాంగం ద్వారా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా సభకు హాజరైన ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, జేబా షేక్, విద్యుత్ శాఖ ఏఈ కే లక్ష్మీ రాజం, స్థానిక నాయకులు సాయి శ్రావణ్, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.