22 August, 2026 | 4:36 PM

ఆటో కార్మికుల నిరవధిక బంద్ కు సీఐటీయూ మద్దతు

22-08-2026 02:34 PM

ఆర్టీసీకి ఈవి ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహారించుకోవాలి

ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

మంచిర్యాల,(విజయక్రాంతి): ఆర్టీసీకి ఈవి ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా ఆటో కార్మికులు, ఆటో జేఏసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యానికి రాష్ట్రంలో నడుస్తున్న ఈ.వి. ఆటోలను ఏర్పాటు చేయటం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టటమే అవుతుందనీ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టటం వలన వేలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోవటం జరిగిందనీ, ఆర్టీసీకి అవసరం అనుకుంటే ఇప్పుడున్న ఆటో డ్రైవర్ల వద్ద ఉన్న ఈ.వి. ఆటోలను తీసుకొని ప్రజారవాణా కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని అన్నారు. కావున వెంటనే ఆర్టీసీ ఈ.వి. ఆటోల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ తర్వాత ఆటో రంగమే లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తుందనీ, రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా జీవనోపాధి కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని ప్రతి మారుమూల గ్రామాల, పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ జీవనోపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇలా ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికి నేటి వరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం రూ. 12 వేలు ఇవ్వాలనీ, హామీ ఇచ్చి రెండేండ్లు గడిచినా అమలు చేయలేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన యాక్సిడెంటల్ గా ఆటో డ్రైవర్ చనిపోయినా వారి కుటుంబానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయన్నారు.

ఆటో డ్రైవర్లు కేవలం వారి జీవనభృతి కోసం కాకుండా రాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నారనీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన ఆటో, క్యాబ్, లారీ, డిసిఎం లాంటి మోటార్ కార్మికులకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. సంక్షేమ బోర్డు వలన రవాణ రంగంలో ఉన్న కార్మికులందరికి భరోసాగా ఉంటుందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఓలా, ఊబర్, రాపిడో యాప్ల ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లను అవసరమైన మేరకు యాప్ ల వారు ఇష్టం వచ్చినట్లు కమీషన్లు దండుకుంటున్నారనీ, ప్రభుత్వమే ఒక యాప్ ను తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.