సురవరం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 22(విజయక్రాంతి): సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, పార్టీ అగ్రనేత కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి(Suravaram Sudhakar Reddy) ప్రథమ వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో కొమురయ్య భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. సురవరం సుధాకర్‌రెడ్డి జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనతో పాటు సీపీఐని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, యాదగిరి, పీక రవికాంత్, జనార్ధన్, జంపాల పవన్, నర్సయ్య, గడ్డం స్వరూప, పల్లెర్ల రజిత, మట్టి నాగమణి, వాసం రజిత, సుభద్రమ్మ, వెన్నెల, లక్ష్మి, భాగ్య, ఐలస్వామి తదితరులు పాల్గొన్నారు.






