తాండూర్‌లో అక్రమ నిర్మాణాలకు చెక్!
- సర్వేనెంబర్ 130లో కబ్జా కట్టడాలు నేలమట్టం
- సెల్లార్ నిర్మాణానికి బుల్డోజర్‌తో షాక్
- చట్టం ముందు అందరూ సమానమే.. మున్సిపల్
- కమిషనర్ ప్రజల ప్రశంసలు
తాండూర్, మే 15 (విజయక్రాంతి) : మమ్మల్ని టచ్ చేసే దమ్ముందా?’ అని విర్రవీ గిన అక్రమ నిర్మాణదారులకు వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. అధికార అండదండలు, అంగబలం, అర్థబలం ఉన్నాయని రెచ్చిపోతున్న భూకబ్జాదారుల ఆట కట్టిస్తూ కొరడా ఝుళిపించారు.
ఆపరేషన్ సర్వేనెంబర్ 130..
సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా సర్వేనెంబర్ 130లో చక్రం తిప్పుతున్న నిర్మాణా లపై స్థానిక కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదు మేరకు కమిషనర్ గ్రౌండ్ పరిశీలన చేసి పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్ తో విరుచుకుపడి గంటల వ్యవధిలోనే అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ‘ఇన్నాళ్లు మా జోలికి వచ్చేవారే లేరు’ అనుకున్న కబ్జాదారులకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.
సెల్లార్ కు చెక్
పట్టణ పరిధిలోని గాంధీనగర్ నడిబొడ్డున నిబంధనలకు విరుద్ధంగా, పక్క భవనాలకు ముప్పు వాటిల్లేలా సెల్లార్ కోసం తవ్విన భారీ గొయ్యి తో ప్రమాదం ఉందని స్థానిక మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు భారీ గొయ్యిని గుర్తించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బుల్డోజర్ రంగంలోకి దింపి, ఆ గుంతను మట్టితో పూడ్చేశారు. ‘అనుమతి లేదు, అడ్డొచ్చినోడి అంతు చూస్తాం’ అనే వారి అహం కారాన్ని అణగదొక్కారు.
వణికిపోతున్న అక్రమార్కులు: కమిషనర్ దూకుడుతో పట్టణంలోని అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ‘రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే సంకేతాలను పంపించడంతో కబ్జాదారులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రజల హర్షం: రోడ్డు కనిపించకుండా ఆక్రమించారు, డ్రైనేజీ పూడ్చేశారు, చెప్పేవాడే లేడు. ఇప్పుడు కమిషనర్ రూపంలో అక్రమార్కులకు తగిన శాస్తి జరిగిందని స్థానికులు మున్సిపల్ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇలాంటి అధికారి ఉంటే చాలు, తాండూర్ను ఎవ్వడూ ఆపలేడు అంటూ సోషల్ మీడియాలో కమిషన్ప అభినందనలు తెలియజేస్తున్నారు.
కమిషనర్ వార్నింగ్
అనుమతి లేకుండా ఒక్క ఇటుక కూడా పేర్చడానికి వీల్లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. జేసీబీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని కమిషనర్ ఘాటుగా హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై సమాచారం ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.






