16 May, 2026 | 3:39 AM

ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన టీఆర్‌ఎస్ నాయకులు

16-05-2026 01:23 AM

పెబ్బేరు మే 15: మండలంలోని పాతపల్లి గ్రామ పరిధిలోని చింతల చెరువుకుంట ఆంజనేయస్వామి చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు టీఆర్‌ఎస్ పార్టీ తరఫున బీసీ జిల్లా అధ్యక్షుడు జయంతి నాయుడు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత మధ్య కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

గత 13 వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పేస్లిప్లు ఇవ్వలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, కూలీల వేతనాలు మాత్రం పెరగకపోవడంతో ప్రస్తుతం ఇస్తున్న రూ.300 కూలీ సరిపోవడం లేదని తెలిపారు.ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కూడా చాలడం లేదని, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నడవలేని స్థితికి చేరుకుంటున్నామని కూలీలు వాపోయారు.

ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షుడు జయంతి నాయుడు, రాష్ట్ర నాయకురాలు అవపురం కళ్యాణి, అంజనేయులు, వెలగొండ సంధ్య, గ్రామ యువకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.