29 June, 2026 | 3:16 AM

చైతన్య గీతాల ‘వనమంచు పల్లె’

29-06-2026 12:00 AM

మిద్దె సురేష్ 

పుస్తక సమీక్షకుడు

మట్టి వాసనలను, పల్లె బతుకులను తన కలంతో పలికించే అచ్చమైన ప్రజాకవి, గేయరచయిత కల్వకోల్ మద్దిలేటి. పాలమూరు మట్టి నుంచి ఉద్భవించిన ఈ కవి శ్రమజీవుల గొంతుకగా నిలిచారు. నల్లమల అడవి అందాలు, కృష్ణమ్మ పరవళ్లు చూస్తూనే, వలస బతుకుల కన్నీళ్లను కూడా దగ్గరగా గమనించారు. సమాజంలోని అసమానతలపై తిరగబడే చైతన్యాన్ని, పేద ప్రజల ఆకలి కేకలను తన పాటల్లో నింపారు.

కష్టజీవుల పక్షాన నిలబడి, వారి హక్కుల కోసం కలం పట్టిన ప్రజా కవుల వరుసలో మద్దిలేటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మద్దిలేటి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటల సంపుటి వనమంచు పల్లె. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జానపద మూలాలను, పల్లె ప్రజల జీవన సంక్షోభాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుంది. ఈ సంపుటిలోని ప్రతి పాట అడవి పరిమళాన్ని, పల్లెతనాన్ని పంచుతూనే సమాజంలో మార్పు కోసం ఆలోచింపజేస్తుంది.

శ్రామికుల కష్టాలు, విప్లవ వీరుల త్యాగాలు, అంబేద్కరిజం, అభ్యుదయ భావాల సమ్మేళనంగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. నిద్రపోతున్న సమాజా న్ని తట్టిలేపే ఒక విప్లవ కాగడాలా ఈ పాటల పూదోట నిలుస్తుంది. ఈ పుస్తకంలోని మొదటి పాట ‘నడువు నుడువు నాగులన్న !’ ఎంతో ఆలోచింపజేస్తుంది. నల్లమలను తవ్వుతుంటే మన బతుకులు ఏమైపోతాయనే ఆవేదనను ఈ పాటలో కవి వ్యక్తపరిచారు.

సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగం వృథా పోదని అభిప్రాయపడ్డారు. సమానత్వ రాజ్యం వచ్చేదాకా ఈ పోరాట పాట ఆగదని స్పష్టం చేశారు. చిన్ననాటి ఆటలు, హరికథలు, భజనల జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు. ‘వనమంచు పల్లె’ అనే పాటలో ఎర్రజెండా విప్ల వ గీతాన్ని వినిపిస్తూ, భూస్వా ములను ఎదిరించిన వీరులకు నీరాజనాలు పలికారు. పేదల బతుకు పాటే తన పాటని కవి ఎంతో గర్వంగా చాటారు.

అంబేద్కరిజం ఆపడం ఎవరితరం కాదని, అంబేద్కర్ అం దరివాడని చాటిచెప్పారు. ‘కానుగచెట్టు నీడన’ అనే పాటలో పేదలకు అక్షరం అందకుండా చేశారనే అభ్యుదయ భావాలను ప్రకటించారు. ఎర్రమ ల్లెల సాక్షిగా కమ్యూనిస్టు పో రుబాటను గుర్తుచేసుకున్నారు. అమ్మ గొప్పతనాన్ని, ఇల్లాలుగా ఆమె పడే తపనను ఎంతో చక్కగా అభివర్ణించారు. తన సొంత గ డ్డ అయిన ‘కొల్లాపురం’ విశిష్టతను కళ్లకు కట్టిన ట్లు పాటగా లిఖించారు.

పూట గడవని నిరుపేదలు, వీధుల వెంట తిరుగుతూ చిరుతిండ్లు అమ్ముకునే సా మాన్యుల ఆర్తనాదా లు చూసి కవి చలించిపోయా రు. ప్రజల కష్టాలను చూసి స్పందించే నాయకుడే నిజమై న హక్కుల నేత అని పేర్కొన్నారు. తన పాటలు ఎప్పుడూ బీదబిక్కి జనాల పక్షమేనని స్పష్టం చేశారు.  ‘నాన్న త్యాగం’ పాటలో కుటుంబ పోషణ కోసం పాటుపడే తండ్రి శ్రమను, ఆయనపై ఉన్న ప్రేమను చాటారు. సఫాయి కార్మికుల శ్రమను గుర్తిస్తూ ‘సలాం సఫాయన్న’ అంటూ గౌరవించారు.

కులమతాల విభేదాలు వీడి సమాజంలో సమభావన పెంపొందాలన్నారు. ప్రమాద సమయాల్లో ప్రాణాలు కాపాడే డ్రైవరన్నల చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. కరోనా నాటి కల్లోలాన్ని గుర్తుచేస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పాట రూ పంలో చెప్పారు. పరిశ్రమల పేరుతో లాక్కుంటున్న వ్యవసాయ భూములను రైతుల ఐక్యతతో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్న కవులు, కళాకారుల దీనస్థితిని ఎత్తిచూపారు.

చెరువుతో ఊరికి ఉన్న అనుబంధాన్ని, కార్మికులు లేనిదే ప్రపంచం ముందుకు సాగదనే సత్యా న్ని చాటారు. ఓటు హక్కు విలువైందని, దానితోనే ప్రశ్నించే తత్వం వస్తుందని చెప్పారు. ‘తంగెడు పూలు’ పాటలో పల్లె జానపద సోయగాలు కనిపిస్తాయి. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను, అన్యాయాలను కవి తీవ్రంగా ఖండించారు.

ప్రకృతికి అం దం తెచ్చే చిలుకమ్మ పలుకులను, ఊర్ల లో తిరిగే సంచారుల జీవన విధానాన్ని వివరించారు. పాలకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించే గొంతుకగా మారారు. సిద్ధాంతం కోసం ప్రాణాలొడ్డిన వారి త్యాగాలను మననం చేసుకున్నారు. పెత్తందార్ల గుండెల్లో గుబులు పుట్టించేలా కవుల పాటలు ఉండాలన్నారు. మద్దిలేటి కలం, గళం నుంచి ఇలాంటి మరిన్ని గీతాలు రావాలని ఆశిద్దాం.