27 April, 2026 | 5:51 PM

ఇంధన కొరత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి: మాజీ ఎంపీ నామ

27-04-2026 04:17 PM

ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో జనరేటర్లకు, అంబులెన్సులకు సకాలంలో ఇంధనం అందక సేవలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యవసర సేవలకు కూడా ఇంధనం అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు.  రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నిలిచిపోవడంతో పంట కోత పనులకు అంతరాయం కలుగుతున్నాయని చెప్పారు. లారీలకు కూడా డీజిల్ లేకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలింపులు నిలిచిపోయాయని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

రోజువారీ పనులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు కూడా రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆటోలు, బస్సులు పరిమితంగా నడవడం వల్ల ప్రజల జీవన విధానం దెబ్బతింటోందన్నారు. చిన్న వ్యాపారులు, సరుకు రవాణాదారులు కూడా ఈ పరిస్థితులతో నష్టపోతున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పరిస్థితిని సమీక్షించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలును ఆయన డిమాండ్ చేశారు.