హైవేపై ఉన్న షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
* ఎస్ఐ బి. శ్రీకాంత్ గౌడ్
గరిడేపల్లి,(విజయ క్రాంతి): గరిడేపల్లిమండల కేంద్రంలోని జాతీయ రహదారి వెంట ఉన్న షాపుల యజమానులతో గరిడేపల్లి పోలీసులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ బి. శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ... వ్యాపార సంస్థల భద్రతతో పాటు ప్రజల రక్షణ దృష్ట్యా హైవేపై ఉన్న ప్రతి షాపులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రస్తుతం సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దొంగతనాలు, చోరీలు, ప్రమాదాలు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం, దర్యాప్తును వేగవంతం చేయడం, ఆధారాలను సేకరించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాల దృశ్యాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
జాతీయ రహదారిపై రోజూ వేలాది మంది ప్రయాణికులు, వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైవే వెంట ఉన్న ప్రతి వ్యాపార సంస్థ యజమాని బాధ్యతగా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.హైవే ప్రాంతంలో నేరాల నివారణ, దొంగతనాల అరికట్టడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఎవివరించారు. సమావేశానికి హాజరైన షాపు యజమానులు పోలీసుల సూచనలను స్వాగతిస్తూ, తమ దుకాణాల్లో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.






