నేడు, రేపు ‘ఐపాకాన్ 2026’
డయాబెటిక్ ఫుట్ కేర్, అవయవాల సంరక్షణపై సదస్సు
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): డయాబెటిస్ బాధితుల్లో పాదాల సమస్య నివారణ, అవయవాల తొలగింపు నివారించడమే లక్ష్యంగా ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ - తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ‘ఐపాకాన్ 2026’ జాతీయ సదస్సు జరగనుంది. మొయినాబాద్‌లోని ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్‌లో నిర్వహించనున్నారు.
సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. మలక్‌పేటలోని అడ్వాన్స్‌డ్ వుండ్ హీలింగ్ క్లినిక్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఏపీఎస్ సూరి మాట్లాడుతూ అవయవాల తొలగింపును నివారించడం, అవయవాలను కాపాడటం, డయాబెటిక్ ఫుట్ తదితర సమస్యలతో బాధపడుతున్న రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు.
ఈ సమిష్టి సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఐపాకాన్ 2026 ఒక కీలక ముందడుగు అన్నారు.వివిధ వైద్య విభాగాల నిపుణులను ఒకే చోటకు చేర్చడం ద్వారా విజ్ఞానం, ఆవిష్కరణలు, క్లినికల్ ప్రాక్టీస్ల మధ్య అనుసంధానం ఏర్పరచడమే మా ఉద్దేశం అన్నారు. ప్రపంచ స్థాయి సైంటిఫిక్ ప్రోగ్రామ్‌ను రూపొందించి, అధ్యయనం, సహకారం, ఆవిష్కరణలకు అద్భుతమైన వేదికను సిద్ధం చేసినందుకు తెలంగాణ చాప్టర్‌తో పాటు మొత్తం నిర్వాహక బృందాన్ని అభినందించారు.
ఈ సైంటిఫిక్ కార్యక్రమంలో డయాబెటిక్ ఫుట్, అవయవాల సంరక్షణకు సంబంధించిన సమగ్ర అంశాలను చర్చించనున్నారని తెలిపారు.ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ - తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ కేవీఎన్‌ఎన్ సంతోష్ మూర్తి మాట్లాడుతూ డయాబెటిక్ ఫుట్ కేర్, అవయవాల సంరక్షణకు సంబంధించిన సమగ్ర అంశాలపై నిపుణులు, పరిశోధకులు, వైద్యులు చర్చించడానికి, నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి వీలుగా ఐపాకాన్ తెలంగాణ సమ్మిట్ 2026ను ఒక వేదికగా తీర్చిదిద్దామన్నారు.
ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ - తెలంగాణ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెజినాల్ డీ లామ్ మాట్లాడుతూ ఆధారాలు, ఆవిష్కరణలు, క్లినికల్ ప్రాక్టీస్ల మధ్య వారధిని నిర్మించాలనే లక్ష్యంతో ఐపాకాన్ తెలంగాణ సమ్మిట్ 2026ను రూపొందించామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ బీ అల్పర్, డాక్టర్ జ్ఞానేశ్వర్ అట్టూరు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఉపాధ్యక్షులు డాక్టర్ గుడుగాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






