22 March, 2026 | 4:54 AM

విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలి

22-03-2026 01:28 AM

మాటలకు చేతలకు పొంతనలేని ప్రభుత్వం

24న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు 

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్

కామారెడ్డి, మార్చి 21 (విజయక్రాంతి): విద్యా రంగానికి కనీసం 20శాతం బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన తిరుపతి కోరారు. బడ్జెట్‌లో తక్కువ కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను వమ్ము చేశారని అన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని అట్టహాసంగా ప్రకటిస్తూ, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయడం విస్మరించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లంటూ, పబ్లిక్ స్కూళ్లంటూ విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తరుణంలో దిగువ స్థాయిలో విద్యా రంగానికి కేటాయింపులు జరపడం గర్హనీయమన్నారు.

ఈ బడ్జెట్ వల్ల విద్యారంగం మరింత కునారిల్లి  పేదలు నాణ్యమైన విద్యను పొందలేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పారు.  విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే 20 శాతం నిధులు కేటాయింపులు జరుపాలని అన్నారు. రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని, టీచర్ల పెండింగు బిల్లులు, పీఆర్సీ  ప్రకటనను డిమాండ్ చే స్తూ ఈ నెల 24న కలెక్టర్‌ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.