4 May, 2026 | 2:54 AM

సాగు భూమిలో ఇటుక బట్టీలు!

04-05-2026 01:35 AM
  1. అనుమతులు లేకుండా వ్యాపారం
  2. అక్రమంగా మట్టి తవ్వకాలు
  3. అక్రమార్కులకు అధికారుల అండ

భద్రాద్రి కొత్తగూడెం, మే 3, (విజయక్రాంతి): అధికారుల అండదండలతో ఇటుక వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయి. నిబంధనలను తుంగలో తొక్కి, అధికారులను మామూళ్ల మత్తులో ముంచి వలస కార్మికుల దోపిడీకి పాల్పడుతూ దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారు ఇటుక వ్యాపారులు. ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే స్థానిక గ్రామపంచాయతీ, రెవెన్యూ కార్యాలయంలో అనుమతులు పొందాల్సి ఉంటుంది.

ప్రజల నివాసం ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయాలని, వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలని, పంట పొలాలకు 100 మీటర్లు, అర్హదారికి 200 మీటర్ల దూరంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలతో తమకు పని ఏమిటన్నట్లు అధికారులను మామూళ్లతో లోపర్చుకొని అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం, చుంచుపల్లి మండలాల్లో అక్రమ ఇటుక వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఇటుక బట్టీలకు అవసరమైన మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ,రాశులుగా పోసి ఇటుకల తయారీని  చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇటుక వ్యాపారులు లాభాలే ప్రధాన లక్ష్యంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. బహిరంగంగా భారీ ఎత్తున అక్రమ ఇటుక వ్యాపారం కొనసాగుతున్న అటు రెవెన్యూ అధికారులు, లేబర్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, చివరకు అటవీశాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం అనేక ఆరోపణలకు దారితీస్తోంది. 

వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీల తయారీ 

వాస్తవంగా ఇటుక బట్టేలను తయారు చేసే ప్రాంతం వ్యవసాయ భూమి అయినట్లయితే రెవెన్యూ అధికారుల నుంచి అట్టి భూమికి కన్వర్షన్ (నాలా) అనుమతులను పొందాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి పల్లె మండలం, చుంచుపల్లి మండలాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలన్నీ ఎలాంటి నాలా అనుమతులు లేకుండానే యదేచ్చగా సాగుతున్నాయి. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. 

వలస కార్మికుల శ్రమదోపిడి 

ఇటుక బట్టీల తయారీకి చత్తీస్గడ్, ఒరిస్సా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నామ మాత్రపు హోలీ చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటుక బట్టీలలో బాల కార్మికులతో పనులు చేస్తున్నడం గమనార్హం. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు కార్మికులతో ఇటుక బట్టేల వ్యాపారులు బెట్టి చాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఇటుక బట్టేలను సందర్శించి కార్మికులకు రక్షణ కల్పించడంతోపాటు, కార్మిక చట్టాలను పరిరక్షించాల్సిన కార్మిక శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఇటుకలు కాల్చేందుకు అటవీకి కన్నం 

ఇటుకలు తయారు చేసే వాటిని కాల్చేందుకు బట్టీలుగా పేర్చిన తర్వాత కాల్చేందుకు అడవి నుంచి కలపను అక్రమంగా తరలించి కాలుస్తున్నారు. అడవులను పరిరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే నజరానాకు తలకి చూసి చూడనట్లు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని బట్టీల్లో చార్కోలు, వరిపొట్టుతో కాల్చడం వల్ల దట్టమైన పొగ వెదజల్లి పరిసర ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం వెదజల్లుతోంది.

మాకు ఎలాంటి అధికారాలు లేవు 

ఇటుక బట్టీల నిర్వహణపై అనుమతులు ఇవ్వడం గాని, చర్యలు తీసుకోవడానికి గాని గ్రామపంచాయతీ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని అనిశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈ విషయమై లక్ష్మీదేవి పల్లె మండలం తాసిల్దార్ శిరీషను వివరణ కోరగా ఇటుక బట్టేల అనుమతులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, పరిశ్రమల శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, గ్రామపంచాయతీ అధికారుల పర్యవేక్షణ లో ఉంటాయని సమాధానమిచ్చారు.

- పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్