11 July, 2026 | 2:26 AM

అక్రమార్కులకు వరంగా భూభారతి

11-07-2026 01:40 AM

బ్రతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో వారసత్వ పట్టాగా మార్పిడి

1/70 ఏజెన్సీ ఏరియాలో అక్రమంగా వారసత్వ పట్టా మార్పిడి

దమ్మపేట, జులై 10 (విజయక్రాంతి): భూభారతి పోర్టల్ అక్రమార్కులకు వరంగా మారింది. గతంలో భూమి కొనుగోలు చేసిన తరువాత పట్టాగా మార్చుకోవాలంటే పెద్ద ప్రహసనంగా వుండేది. భూమి కొనుగోలు దారులు పట్టామార్పిడి లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భూభారతి పోర్టలును తీసుకు వచ్చింది. ఇప్పుడు ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.

దమ్మపేట మండల పరిధిలోని ఏజెన్సీ ఏరియా 1/70 యాక్టు అమలులో వున్న పెద్దగొల్లగూడెం రెవెన్యూలో టి27100060299, ఖాతా నెంబరు 484తో మళ్ళా సత్యం తండ్రి గురవయ్య పేరుతో 5.00 ఎకరములకు పట్టాదారు పాసుపుస్తకము వుంది. ఏజెన్సీ ఏరియాలో పట్టా మార్పిడి కావాలంటే గిరిజనులకు మాత్రమే గిఫ్టు, సేల్ డీడ్ సాధ్యమవుతుంది. మరణించినవారికి మాత్రమే ఏజెన్సీ ఏరియాలో కూడా గిరిజనేతరులకు పట్టా మార్పిడి చేసుకునే అవకాశం వుంది.

అక్రమార్కులు ఇదే అంశాన్ని లొసుగుగా భావించి బ్రతికున్న మళ్ళా సత్యం పేరుతో మరణ ధృవీకరణ పత్రం 2018 జూన్ 29,  రిజిస్ట్రేషన్ నెంబరు 28తో మరణించినట్లుగా మరణధృకరణ పత్రం పొంది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆర్.సి.నెం.బి/758/2026, తేది. ఏడాది జూన్ 12 న మళ్ళా సత్యం వారసులుగా భార్య తాళ్ళ పుల్లమ్మ (డైడ్) కుమార్తె నామ పుష్పవతి పేరుతో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి నామ పుష్పవతి పేరుతో వారసత్వ (సక్సెషన్) పట్టా 2026,మే 26వ తేదీన పట్టాదారు పాసుపుస్తకము నెంబరు టి27100060834తో పొందారు.

మళ్ళా సత్యంకు వాస్తవంగా నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మళ్ళా సత్యం బి.సి. కులానికి చెందినవాడు కాగా, నామ పుష్పావతి జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తి. వారసత్వ పట్టా మార్పిడి చేయాలంటే పట్టాదారు కుమారుడు, కుమార్తె, లేదా భార్య అయివుండాలి, ఎలాంటి బంధుత్వం లేని నామ పుష్పావతి పేరుతో పట్టామార్పిడి జరిందంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఇట్టే అర్ధమవుతుంది.

పట్టా మార్పిడి దరఖాస్తు చేసిన తదుపరి మొదటగా గ్రామ పరిపాలన అధికారి పూర్తి స్థాయిలో విచారించి,  విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్కు పంపుతారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణ తరువాత భూభారతి పోర్టల్లో దరఖాస్తు దారుల వేలిముద్రలు స్వీకరించి పట్టాదారు పాసుపుస్తకము జారీ చేస్తారు. వీరి విచారణలో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మాన్యువల్ గా జూన్ 12, 2026న పొందిన విషయం గమనించకపోవడం గమనార్హం.

వాస్తవంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మీసేవలో పొందినదై వుండాలి. ఇవేమీ గుర్తించకుండా నామ పుష్పావతి పేరుతో పట్టాదారు పాసుపుస్తకము జారీ చేయడం శోచనీయం. అవినీతి, అక్రమాలకు పాల్పడి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారిపై, జారీ చేసిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాహశీల్దార్ వివరణ:

తప్పుడు మరణ దృవీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పై వారసత్వ పట్టాదారు పాసుపుస్తకము జారీపై తాహశీల్దార్ రామ్ నరేష్ ను వివరణ కోరగా మళ్ళా సత్యం ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని, పెద్దగొల్లగూడెం గ్రామ పరిపాలన అధికారిని విచారించగా ఇదంతా తనకు తెలిసే జరిగిందని, ఈ నకిలీ పట్టామార్పిడి పై పూర్తి భాధ్యత వహిస్తానని గ్రామ పరిపాలన అధికారి అంగీకరించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు, తాహశీల్దార్  తెలిపారు.

నేను బతికే ఉన్నాను మహాప్రభో...

ఈ సందర్భంగా బాధితుడు మళ్ళా సత్యం మాట్లాడుతూ నేను భూమి ఎవరికీ అమ్మలేదని, నేను బ్రతికి వుండగానే మరణించినట్లు మరణధృవీకరణ పత్రం జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నకిలీ ఫ్యామిలీ మెంబర్ ధృవపత్రం సృష్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. నాకు రావలసిన పెన్షన్ ఆగిపోయిందని, రైతుబంధు రాలేదని వాపోయాడు.