11 July, 2026 | 2:25 AM

నిండుకున్న నిర్లక్ష్యం.. నల్లగొండలో నరమేధం..!

11-07-2026 01:25 AM
  1. ఖాకీల వైఫల్యానికే నలుగురు బలి..?
  2. నిందితుడు అస్లాం పాత నేరాలను లైట్ తీసుకున్న పోలీసులు
  3. దొంగతనం కేసులో చర్యలు తీసుకుంటే ఆ కుటుంబం బతికేదేమో అంటూ విమర్శలు
  4. పోలీసుల అలసత్వంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం

నల్లగొండ నిఘా విభాగం, జూలై 10 (విజయక్రాంతి): చట్టాన్ని రక్షించాల్సిన చేతుల్లోని నిర్లక్ష్యం.. ఒక నిండు కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు నిఘా ఎంత ముఖ్యమో.. చిన్న నేరాలను నిర్లక్ష్యం చేయడం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో నల్లగొండ నలుగురి హత్య ఉదంతం కళ్లకు కడుతోంది.

నిందితుడు అస్లాం గతంలో అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడినప్పుడే పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పి, చట్టపరమైన నిఘా ఉంచి ఉంటే.. ఈ రోజు సుల్తాన్ కుటుంబం ప్రాణాలతో ఉండేదన్నది చేదు నిజం. ఖాకీల అలసత్వమే నిందితుడిలో నేరప్రవృత్తిని పెంచి, ఒకే ఇంట్లో నలుగురిని నరమేధం చేసేలా ఉసిగొల్పిందా అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల వైఫల్యాన్ని వేలెత్తి చూపుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని, దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణ నరమేధం వెనుక కేవలం నిందితుడి క్రూరత్వమే కాదు.. స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం, వైఫల్యం కూడా ఉందనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అప్పట్లోనే పోలీసులు అలసత్వం వహించకుండా ఉండి ఉంటే.. ఈ రోజు ఆ నలుగురు ప్రాణాలతో ఉండేవారేమోననే కోణం ఇప్పుడు ఈ కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్గా మారింది.

పాత కేసు.. లైట్ యాక్షన్..! :  

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు అస్లాం, బాధితులకు కొత్తవాడేమీ కాదు. గతంలోనే ఇదే సుల్తాన్ ఇంట్లో అస్లాం దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల నిందితుడు అస్లాం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినట్టు తెలుస్తోంది. అప్పట్లోనే ఈ దొంగతనంపై బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా, నిందితుడిపై గట్టి నిఘా పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఒకవేళ అప్పట్లోనే నిందితుడు అస్లాంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, విచారణను సరైన పద్ధతిలో ముగించి ఉంటే.. అతనిలో నేరప్రవృత్తి పెరిగేది కాదని, తద్వారా ఈ రోజు ఇంతటి ఘాతుకానికి పాల్పడే ధైర్యం చేసేవాడు కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఆనాటి అలసత్వమే.. ఈ రోజు నిందితుడిని హంతకుడిగా మార్చడానికి పరోక్షంగా కారణమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకే కుటుంబంలో నలుగురు అన్యాయంగా..: 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ కాలనీకి చెందిన సుల్తాన్ (45) ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదటి భార్య మరణించడంతో, ఆయన హసీనా (38)ను రెండో వివాహం చేసుకున్నారు. హసీనా ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. సుల్తాన్ మొదటి భార్య పిల్లలైన ముజామిల్ (20) ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తుండగా, కుమార్తె అఫోర (14) తల్లి పని చేసే స్కూల్లోనే 7వ తరగతి చదువుతోంది.

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ మధ్యతరగతి కుటుంబంపై నిందితుడు అస్లాం పగతో రగిలిపోయాడు. పాత వివాదాలు, దొంగతనం ఉదంతాల నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి.. దంపతులతో పాటు ఇద్దరు అమాయక పిల్లలను కూడా వదలకుండా నలుగురిని అతి దారుణంగా హతమార్చాడు. దొంగతనం జరిగిందని ఫిర్యాదు వచ్చినప్పుడు తెలంగాణ కాలనీలో పోలీస్ గస్తీ నిర్వహించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది రెండు ప్రధాన రహదారుల మధ్య ఈ కాలనీ ఉంటుంది. 

పోలీసుల వైఫల్యమే వారి మృతికి కారణమా..? : 

శాంతిభద్రతల పరిరక్షణలో, ముందస్తు నేరాల నియంత్రణలో పోలీసు వ్యవస్థ విఫలమైందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, లేదా ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడి దొరికిన నిందితుల కదలికలపై నిఘా ఉంచడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

చిన్న, చిన్న నేరాలు జరిగినప్పుడే పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే, అవి పెద్ద నేరాలుగా మారకుండా అడ్డుకోవచ్చు. కానీ, ఈ కేసులో బాధితుల భద్రతను గాలికొదిలేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒక చిన్న దొంగతనం కేసును నిర్లక్ష్యం చేయడం వల్ల.. ఈ రోజు ఒక వ్యాపారి, ఒక ప్రైవేట్ టీచర్, భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతీ, యువకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నలుగురి మృతికి కేవలం హంతకుడి కత్తి పోట్లే కారణం కాదు.. పోలీసుల వ్యవస్థ గత నిర్లక్ష్యపు వేటు కూడా కారణమంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.