17 June, 2026 | 2:24 AM

భద్రాచలంలో బెల్ట్ షాపులు బంద్

17-06-2026 12:00 AM

గ్రామపంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం

భద్రాచలం, జూన్ 16, (విజయక్రాంతి): భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం మంగళవారం నాడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పూణేం కృష్ణ అధ్యక్షతన జరగగా, ముఖ్యఅతిథిగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు పాల్గొని భద్రాద్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను పంచాయితీ కార్యవర్గం తీసుకుంది. దానిలో భాగంగా  భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బెల్ట్ షాపులను తీసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది, అదే విధంగా నివాసాల మధ్య కాలి స్థలాలలో ఇష్టానుసారంగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను  తొలగించకుండా పట్టించుకోని భూ యజమానులకు తొలిత సమాచారం అనంతరం నోటీస్ జారీ చేసే విధంగా తీర్మానం చేశారు.

రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన డ్రైనేజీలను జెసిబి లతో పూడికలు తీయించడంతోపాటు ఇంటి పన్ను తదితర కీలక అంశాలపై పాలకవర్గం పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు వెంకటరావు మాట్లాడుతూ భద్రాచలం పంచాయతీ చేపట్టే అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత ,  వార్డు సభ్యులు చెంచు సుబ్బారావు, బొంబోతుల రాజీవ్, బొంత రమణ, బండారు శరత్ బాబు, నర్రా వాణి, అభ్బినేని వీనిల రాణీ, కావూరి గోపి, పెద్దినేని లక్ష్మి, కారం సుజాత, నిట్టా రాజు, భుక్య సుశీల, కారం దుర్గారావు, తాటి ఉదయ్, ఇనమల అశోక్, సున్నం ఈశ్వరి, సున్నం భూలక్ష్మి, జగ్గా కుమారి, తుర్రం మహేష్, ఇర్ప అనసూయ ,గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు , గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.