31 July, 2026 | 4:43 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ లేజర్ లైట్లపై నిషేధం

31-07-2026 01:43 AM

పోలీసుల హెచ్చరిక

శంషాబాద్, జులై 30 (విజయక్రాంతి): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో విమానాల భద్రతకు ముప్పు కలిగించే లేజర్, స్కై బీమ్, మూవింగ్ లైట్ల వినియోగంపై పోలీసులు జూలై 30 నుంచి కఠిన నిషేధం విధించారు. ఈ సందర్భంగా శంషాబాద్ డిసిపి కార్యాలయంలో విమానాశ్రయ చుట్టుపక్కల ఉన్న సుమారు 70 కన్వెన్షన్, ఫంక్షన్ హాళ్లు మరియు ఫామ్హౌస్ల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

అదనపు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ (ఐపీస్), శంషాబాద్ డీసీపీ బి. రాజేష్ (ఐపీస్), ఇతర భద్రతా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో ఆకాశం వైపు ప్రసరించే అధిక కాంతి వల్ల పైలట్ల దృష్టి మరలి పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఈ లైట్లు వాడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.