అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు శూన్యం..!
ఆక్రమిత స్థలంపై న్యాయం చేయాలని అధికారులకు బడితెల రాజశేఖర్ విజ్ఞప్తి
మంథని, జూలై 13(విజయక్రాంతి): తమ కుటుంబానికి చెందిన ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన ఘటనలో అన్ని ఆధారాలు, అధికారుల నివేదికలు, ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రిటైర్డ్ ఉపాధ్యాయుడు బడితెల రామయ్య కుమారుడు బడితెల రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంథని పట్టణంలోని పోచమ్మవాడలో ఉన్న తమ కుటుంబ స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులు, పాత పత్రాలు, అధికారిక ధ్రువీకరణలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు కూడా అక్రమ నిర్మాణాలు జరిగిన విషయాన్ని గుర్తించినప్పటికీ, వాటిని తొలగించేందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
83 ఏళ్ల వృద్ధుడైన తన తండ్రి బడితెల రామయ్య న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు. ఆక్రమణలతో పాటు బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం, జిల్లా ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఆశ్రయించామని, మంథని పోలీసులకు సూచనలు వెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నప్పటికీ వాటి ఆధారంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పారదర్శక పాలన గురించి చెబుతున్న సమయంలో ఒక వృద్ధ ఉపాధ్యాయుడికి న్యాయం జరగకపోవడం విచారకరమని రాజశేఖర్ అన్నారు. ఆక్రమణదారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని, ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసి తమ కుటుంబానికి అప్పగించాలని కోరారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని బడితెల రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.






