13 July, 2026 | 6:00 PM

బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

13-07-2026 04:38 PM

నాగిరెడ్డిపేట,జూలై 13 (విజయక్రాంతి): అల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు,దేవసోత్ రమేష్ నాయక్ సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సంగ్వాన్కు  వినతిపత్రాలను సమర్పించారు.నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో  బంజారా (లంబాడీ) కమ్యూనిటీ హాల్ నిర్మాణం(Banjara community hall) కోసం 10 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.అలాగే బోధన్–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-765D)పై ఉన్నటువంటి మెల్లకుంట తండా గ్రామపంచాయతీ ప్రధాన గేటు వద్ద శాశ్వత టీజీఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు.నాగిరెడ్డిపేట్ మండలంలో బంజారా తండాల్లో అధిక సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ సామాజిక,సాంస్కృతిక కార్యక్రమాలు,వివాహాలు, ప్రభుత్వ సంక్షేమ అవగాహన సమావేశాలు,విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు కమ్యూనిటీ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో 10 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా, మెల్లకుంట తండా బోధన్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ టీజీఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు అక్కడ ఆగకపోవడంతో ప్రతిరోజూ 50 నుంచి 100 మంది విద్యార్థులు,ఉద్యోగులు, రైతులు,మహిళలు, వృద్ధులు గోపాల్‌పేట్ వరకు వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని వివరించారు.దీనివల్ల సమయం,డబ్బు వృథా కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి త్వరితగతిన చూపాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సంగ్వాన్కు గిరిజన సంఘ నాయకులు మోహన్ నాయక్,దేవసోత్ రమేష్ నాయక్లు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.