విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
ముకరంపుర, జూలై 13(విజయ క్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని(National Deworming Day) పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారే పేగు సంబంధిత నులిపురుగుల నివారణే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే బలమైన దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీరామ్, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






