నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ( వివో ఏ) ఓబీలకు నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత, అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాష్ తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. సురక్షిత తాగునీరు, మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం, విఓలపై ఉందన్నారు.
అప్మాస్ సంస్థ ద్వారా మహిళా సభ్యులు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే వారికి 2 లక్షల రూపాయలు, కమ్యూనిటీ బోర్ వెల్ వేసుకుంటే 25 వేల రూపాయల సబ్సిడీ అందుతుందని వెల్లడించారు. జిల్లా ప్రాజెక్టు అధికారి అనిత, ఏపీఎం దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి సంఘం సమావేశంలో పారిశుధ్యాన్ని ఒక అజెండాగా చేర్చి, ప్రతి ఇంటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించాలని విఓఏలకు సూచించారు. గ్రామాల్లోని ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటి పరిసరాల శుభ్రతపై విఓఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం దుర్గ ప్రసాద్,సీసీలు, మండల సమాఖ్య అధికారులు విఓఏలు పాల్గొన్నారు.






