బాలబాలికల సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మహిళల,బాలికల భద్రత మా బాధ్యత : సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్
మానకొండూరు,(విజయక్రాంతి): బాలబాలికల సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్ కన్వెన్షన్ లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బాల పంచాయతీపై నిర్వహించిన అవగాహన సదస్సను ఆయన ప్రారంభించారు. అనంతరం హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత,సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పిల్లలపై జరుగుతున్న వివిధ రకాల దౌర్జన్యాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, ఆన్‌లైన్ వేధింపులు వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల హక్కులపై అవగాహన పెంపొందించడం ద్వారా వారి భవిష్యత్తును మరింత సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో బాలల సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. బాలల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారి ఆలోచనలకు వేదిక కల్పించేందుకు బాల పంచాయతీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. "బాలల హక్కుల పరిరక్షణకు, వారిలో నాయకత్వ వికాసానికి ‘ఇదొక అద్భుతమైన వేదిక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై కూడా పిల్లల.కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బాలల హక్కులు, రక్షణ అంశాలపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
మహిళల,బాలిక భద్రతే మా బాధ్యత: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
మహిళలు, బాలల భద్రత కల్పించడమే తమ బాధ్యత అని, అందుకే జిల్లా పోలీసు శాఖ మహిళలు, బాలికల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. జిల్లాలో బాలికలను రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు ఇప్పటికే చె పట్టామని, అందులో భాగంగానే ‘స్నేహిత’ అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా ‘సీక్రెట్ బాక్స్’ లను ఏర్పాటు చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించామని సీపీ తెలిపారు.
విద్యార్థినులు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా, వేధింపులనైనా ఈ సీక్రెట్ బాక్సుల ద్వారా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, ఈ బాక్సులకు తాళాలు వేసి ఉంచుతామని, వాటి తాళం చెవులు మహిళా కానిస్టేబుళ్ల ఆధీనంలోనే ఉంటాయని,ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా అధైర్యపడకుండా తక్షణమే షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సీపీ సూచించారు.
బాధితులు నేరుగా కాకుండా మొబైల్ నంబర్ 8712670759 ద్వారా వాట్సాప్ లేదా కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అందు వల్ల నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్లు శ్రీలత, పుల్లయ్య, రమేష్‌లతో పాటు షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి చెందిన సభ్యులు, మహిళలు, బాలలు తదితరులు పాల్గొన్నారు.






